AP New Pensions: కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు తాజాగా సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు కలెక్టర్లు ఆ పనిలో పడ్డారు.

కొత్త పెన్షన్ల అంశం ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటివరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేదనీ.. దీనివల్ల తాము బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని కలెక్టర్లు సీఎం చంద్రబాబుకి చెప్పారు. అప్పుడు సీఎం వెంటనే స్పందించారు. “ఓ పని చెయ్యండి. జిల్లాకు 200 కొత్త పెన్షన్లు ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయం తీసుకోండి” అని చెప్పారు. దాంతో కలెక్టర్లు ఖుషీ అయ్యారు. కనీసం తాము జిల్లాకు 200 మందికైనా న్యాయం చెయ్యగలం అని వారు సంతృప్తి చెందారు.

ఈ కొత్త పెన్షన్లు అందరికీ ఇవ్వరు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికీ, క్యాన్సర్ బాధితులకూ, దివ్యాంగులకు మాత్రమే కొత్తగా ఇస్తారు. వారు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తు ప్రక్రియ ఏదీ లేదు. బాధితులు జిల్లా కలెక్టర్‌ని కలవాలి. తాము ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారో చెప్పాలి. పెన్షన్ ఎలా వారికి అత్యంత అవసరమో వివరించాలి. దాంతో కలెక్టర్.. దరఖాస్తు పెట్టుకోమని చెప్పి.. ఆ ప్రక్రియను వివరిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలోనే దరఖాస్తు పెట్టుకునే ప్రక్రియను పూర్తి చేయిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక.. ఆ దరఖాస్తును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలిస్తారు. పెన్షన్ ఇవ్వాలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. జిల్లాకు 200 మాత్రమే కావడంతో.. అంత తేలికగా నిర్ణయం తీసుకోరు. నిజంగానే పెన్షన్ అత్యవసరం, తప్పక ఇవ్వాలి అనుకుంటేనే.. ఆమోదిస్తారు. కాబట్టి.. దరఖాస్తు చేసుకునేవారు.. తమకు పెన్షన్ ఎంత అవసరమో.. అధికారులకు అర్థమయ్యేలా చెయ్యాలి. విపరీతమైన పోటీ ఉంటుంది. అల్టిమేట్‌గా నిజమైన బాధితులకు న్యాయం జరగాలి.

